Monday, September 28, 2020

బాలోచ్చిష్టం







అది లలితా పరమేశ్వరి సభ, అక్కడ సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆ వీణానాదానికి సంతసించి లలితాదేవి "శభాష్ " అని అంది.  తన వీణా నాదాని కన్నా ఆవిడ పలుకులే తీయగా ఉన్నాయని సరస్వతీదేవి వీణ ఆపేసి పైన పరదా వేసేసింది. పరదా వేసినా ఇంకా తంత్రులు మ్రోగడం చూసి కోపమొచ్చిన సరస్వతీ దేవి ఆ కఛ్ఛపిలో ఆ తీగని భూలోకంలో జన్మించమని అంది. అలా మనుష్యరూపంలో భూలోకానికి వచ్చావు. నడుస్తొన్న సరిగమల సమాహారం అయ్యావు. సరస్వతి చేతిలో ప్రావీణ్యం పొందావేమో కూనిరాగం తీసినా కల్యాణిరాగమే అయ్యింది. 

ఆకాశం నుండి మాకోసం వచ్చావు.. పాటల మిఠాయి పొట్లాలందించావు, నీ పలుకే త్యాగరాజ కీర్తననన్నావు, కథ చెబుతాను ఊ కొడతావా ఉలిక్కిపడతావా? అని లాలించావు, సంగీత సాహిత్యాలు నీకు సమలంకారాలన్నావు. శివస్తుతి ఆలాపించి భక్తిరసంతో ఆ కైలాసనాథుణ్ణీ మెప్పించావు, నీ పాట లేని కార్తీక మాసం లేదంటే అతిశయోక్తి కాదేమో! 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అని సిరిమల్లెని విరుజల్లుగా రమ్మని ఆహ్వానించావా? చూడు.. ఇక అబ్బాయిల మదిలో దివిలో విరిసిన పారిజాతాలవైపు మొగ్గ చూపాయి. కాపురం.. అదే కొత్త కాపురంలో పెదవిలోని మధువులను వ్రతము పూని జతకు చేరినప్పుడు  కాటుకలంటుకున్న కౌగిలింత గురించి ఏమీ చెప్పను ఎలా చెప్పను అంటూ చెప్పకనే చెప్పి వేసవి రేయిలో మదిలో మల్లెలు చల్లావు. పెళ్ళంటె ముద్దూ ముచ్చట్లు మురిసే లోగుట్లు  చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు అని ముసిపోయారు, చామంతి పువ్వంటి చెల్లెలు కావాలా? బుజ్జిబాబు కావాలా? అని కోరికలు గెలలు వేయించావు. సంసారం ఒక చదరంగం అంటూ విసిగిన వాడి చేత భర్తగ మారకు బాచ్లరూ అని సూచనలిచ్చావు.  ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, అందరు నీవారు  చివరికి మిగిలేదెవరూ లేరు అని వైరాగ్యాన్ని కలిగించి జీవిత సత్యాలని కళ్ళకు కట్టావు. నవ్వుతూ వెళ్ళిపో నువ్వుగా మిగిలిపో, నవ్వుతూ బతకాలి  అని బుద్ధులు చెప్పావు. మాకు ఆనందమొచ్చినా నీ పాటే, కష్టమొచ్చినా, ఏడుపొచ్చినా ఓదార్పు కావాలన్నా నీ పాటే,  ప్రేమ సఫలమయినా నీ పాటే, విఫలమైనా నీ పాటే! నీ పాటతో మమ్మల్ని కట్టిపారేశావు.  


 నువ్వు ఆలపించిన పాటలన్నీ పంచామృతంలా మేము ఆస్వాదించాము. నా కంఠంలో నవరసాలే కాకుండా అదేదో కొత్త రసం మాకు అన్నిటికన్నా ఎక్కువ ఇషటపడేటట్టు అందించావు. బహుశా అది బాలూ అమృత రసమేమో! ఆ రసం తాగే మేమంతా పరవశులమై నీ వశమైపోయాము. నవరసాలే ఉన్నాయన్న వారికి నీ కంఠంతో అమృతరసమందించిన దశకంఠుడవు.. ఊహూ కాదు శతకంఠుడవు... అబ్బేబ్బే అదీ కాదు... సహస్ర కంఠుడవు నువ్వు. కఛ్ఛపి అంశానివి కదా.. అనంత రాగాల వీణాఝరివి. సినిమా పాటలన్నింటినీ ఎంగిలి చేసేశావు. ఇప్పుడు మేమంతా ఆనందిస్తున్న ఆ పాటలన్నీ   బాలోచ్చిష్టాలే కదా!     


నువ్వు కోరుకున్నట్టుగానే శ్రీచరణ మందారం మీద మధుపముగా వాలి మధుధారలు గ్రోలుతూ  ఉఛ్వాసం కవనం.... నిశ్వాసం గానంగా కడతేరావు.   వస్తా ఎళ్ళొస్తా...  అన్న పెద్దమనిషివి ఇది తిరుగులేని పయనం తిరిగి రాని పయనం అంటూ వెళ్ళిపోయావు.  

  నీ గొంతులో పల్లవించిన పాటలన్నీ నా పాటకే శెలవు నా మాటకే శెలవు  నువ్వెళ్ళిపోతే పదిలంగా అల్లుకొన్న బ్లాగ్ చలి వేణువయ్యింది. బ్లాగ్ రాయాలని లేదు, కానీ నీకు నేనిచ్చిన మాట అదే ఐదు వేల పాటలందిస్తాను అని అన్నాను కదా అది గుర్తొచ్చింది (ఇప్పటికి 3172 పాటలయ్యాయి).  మళ్ళొస్తానని మరలిరాని లోకానికి నువ్వెళ్ళిపోయి మాట నిలుపుకోలేదు, కానీ రేపు నిన్ను కలిసినప్పుడు "నువ్వూ మాట నిలుపుకోలేదు కదా " అని నన్నంటావు. కాబట్టి నువ్వు పాడిన పాటలతోటే నీకు నీరాజనాలర్పిస్తాను. 

కోటికి ఒక్కరే పుడతారు పుణ్యమూర్తులు వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. నువ్వు కారణజన్ముడివి. సినీసంగీతానికి కొత్త నడవడి నేర్పడానికి వచ్చావు పండితులకే కాదు పామరులకి కూడా ఆరాధ్యుడవయ్యావు..  పాటల తోటని మాకు వదిలి  కఛ్ఛపిలో కలిసి మళ్ళీ సరస్వతి చేతిలోకి చేరావు.  నువ్వు అందించిన పాటలెన్నో.. నీకు మాత్రం ఏవీ ఇవ్వలేనిదాన్ని.. రెండు కన్నీటి చుక్కలు తప్ప! 🙏🙏🙏

4 comments:

  1. చాలా బాగుదండి.

    గొప్పగా చెప్పారు

    ReplyDelete
  2. "నవరసాలే ఉన్నాయన్న వారికి నీ కంఠంతో అమృతరసమందించిన దశకంఠుడవు.. " - చాలా గొప్ప ఊహ !

    ReplyDelete
  3. బ్లాగ్ చలి వేణువయ్యింది...నాబోటి పామరుల కంఠాల్లో సైతం పల్లవించే ఆయన ఉచ్చిష్టం గడ్డ కట్టుకుపోయింది....
    బాలూ....బాలూ!!!🙏🏼🙏🏼🙏🏼
    జన్మ జన్మలకూ నీ ఋణం తీర్చుకోలేం...

    ReplyDelete