కుంచించుకుపోయిన బుద్ధితో సర్వవ్యాప్తి అయిన ఆ భగవంతుడిని ఈశాన్యానికే పరిమితం చేసిన మనకు 'అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది' అని ఉండమ్మా బొట్టు పెడతానని చెప్పారు.
'కుదురులేని గాలి వెదురులోకి ఒదిగితే ఎదురులేక ఎలా ఎదుగుతుందో' స్వర్ణకమలాలతో చూపించారు.
'ఆలోచనామృతమూ ఆత్మ సంభాషిని సాహిత్యమని, అద్వైతసిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానమని, క్షారజనదులు నాట్య కళ ద్వారా క్షీరములే అవుతాయని, ఆనందంతో చేసిన హేల ఆ శివుని నయనత్రైలాస్యమే అని నిరూపించారు.
విదేశాలకు వెళ్ళాకే మాతృదేశం యొక్క గొప్పదనం తెలుసుకొని, సొంత ఊరిని దత్తతు తీసుకొని అభివృద్ధి చెయ్యాలని జనని జన్మ భూమే గొప్పదని చాటారు.
విషకీటకమైనా శంకరుడి ఆభరణమైతే గౌరవించబడుతుందని, ఎంత ఎదిగినా అసూయతో రగిలితే ఆ జ్ఞానం అంధకారమే అని స్వాతికిరణంగా తెలిపారు.
సప్తపది ద్వారా పునర్వివాహం తప్పుకాదని చెప్పినా, 'నటరాజ స్వామి జటాఝూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది?' అని సముద్రానికి కూడా చెలియలికట్ట అవసరమని చెప్పారు.
వరకట్నం మీద విప్లవం తీసుకొని రాడానికే శుభలేఖ పంచారు. వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ స్వాతిముత్యమే అయ్యారు. తనదు స్వరసత్వము వారసత్వముగా ఇచ్చిన తల్లితండ్రులే శ్రుతిలయలు అని తెలిపారు.
ఈ మాత్రం సంగీతసాహిత్యాభిమానం మా తరానికి కలిగిందంటే ఆయనే కారణం! ప్రతీ సినిమాలోనూ ఒక అన్నమయ్య కీర్తనో, త్యాగరాయ కృతినో పెట్టి పండిత పామరులను అలరించారు, వాటిని పరిచయమూ చేశారు. ఆయన సినిమా అంటే ఇంట్లో అందరు కలిసి చూసే పండగలాంటిది. ఒక్కో సారి ఒక్కో విషయాన్ని తెలియచేస్తుంది చూసిన సినిమా అయినా!
'కలవని తీరాల నడుమ కలకలసాగక యమున వెనుకకు తిరిగిపోయిందా?' అని ప్రశ్నించినట్లు ఇటువంటి స్పీడ్ యుగంలో ఇలాంటి ఆణిముత్యాలు తీసి ప్రవాహానికి ఎదురేగారు . ఈ సినిమాలన్నీ ఆయన 'ఆత్మగౌరవాన్ని' పెంచినవే.
ఇన్నీ సినిమాలు తీసినా ఆయన గొప్పదనాన్ని పొగిడితే "ఆ టైంకి అలా అయ్యిపోయింది అంతే, అంతా ఆ శివుడి కృప" అని ఒక నమస్కారం పెట్టేశారు.
సినిమాల ద్వారా ఎన్నో పాటలకు అందమైన రుచులు చూపించినా, ఆయనతో పాటు భోజనానికి కూర్చున్నప్పుడు కొత్తావకాయలో వెన్నతో మామిడిపండు ముక్కలు నంచుకోమని చెప్పి తినిపించిన ఆ రుచి మాత్రం మరువలేను (అప్పటి వరకు తినలేదు, ఇక తినబోను). ఇంట్లో ఒక పెదనాన్న గారో, ఒక తాతగారో అలా తినిపించినట్లు అనిపించింది.
శరీరానికి జరామరణం ఉంటుంది, ఉండి తీరాలి కూడా, కానీ ఆయన కోరుకున్నట్టు 'అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం' కోరిక ఆయనకు లభించింది. ఏ ఒక్క మచ్చ లేకుండా ఆ కాశీనాథుడిని చేరిన యశస్వి విశ్వనాథ్ గారు. బ్రతకడం ఇలా బ్రతకాలి, సినిమాలు ఇలా తియ్యాలి... శరీరాన్ని ఇలా వదలాలి అని బ్రతికి చూపించిన ఋషి ఆయన.
No comments:
Post a Comment