Tuesday, August 19, 2014

గిరిజా కల్యాణం

చిత్రం :  రహస్యం (1967)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  మల్లాది
నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల, పి.లీల


పల్లవి :


అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు
అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు మా శారదంబా పరాకు


ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా..
బహుపరాక్ బహుపరాక్...


చండభుజాయమండల దోధూయమాన వైరిగణా.. షడాననా
బహుపరాక్ బహుపరాక్..


మంగళాద్రి నారసింహ... బహుపరాక్ బహుపరాక్...
బంగరు తల్లి కనకదుర్గ.. బహుపరాక్ బహుపరాక్..
కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ.. బహుపరాక్...


అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా
అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా
లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశులయ్యే
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా


ఈశుని మ్రోల.. హిమగిరి బాల..
ఈశుని మ్రోల.. హిమగిరి బాల..కన్నెతనము ధన్యమయిన గాథ
కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ..ఆ కోపీ..
కాకలు తీరీ కను తెరచి తను తెలసీ
తన లలనను పరిణయమాడిన ప్రబంధము
అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా..


చరణం 1 :


రావో.. రావో.. లోల లోల లోలంబాలక రావో....
రావో రావో లోల లోల లోలం బాలక రావో
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి
లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి
రాజ సులోచన రాజాననా...
రావో రావో లోల లోల లోలంబాలక రావో


చెలువారు మోమున లేలేత నగవులా
కలహంస గమనాన కలికీ ఎక్కడికే
మానస సరసినీ మణి పద్మదళముల
రాణించు అల రాజహంస సన్నిధికే


వావిలి పూవుల మాలలు గైసేసి
వావిలి పూవుల మాలలు గైసేసి
వయ్యారి నడల బాలా ఎక్కడికే
వయ్యారి నడల బాలా ఎక్కడికే


కన్నారా నన్నేల కైలాస నిలయాన
కొలువైన అల దేవదేవు సన్నిధికే ....


తగదిది తగదిది తగదిది
ధరణీధర వర సుకుమారీ
తగదిది తగదిది తగదిది
ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ ..

 

అండగా మదనుడుండగా
మన విరిశరముల పదనుండగా
నిను బోలిన కులపావని తానై
వరు నరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...
తగదిది తగదిది తగదిది
ధరణీధర వర సుకుమారీ..


కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా
కోలనేయనా సరసను కూలనేయనా
కనుగొనల ననమొనల గాసి చేసి.. నీ దాసు చేయనా
తగదిది తగదిది తగదిది
ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ ..

చరణం 2 :

ఈశుని దాసుని చేతువా... అపసద... అపచారము కాదా
ఈశుని దాసుని చేతువా..
కోలల కూలెడు అలసుడు కాడూ... ఆదిదేవుడే అతడూ...
సేవలు చేసి ప్రసన్నుని చేయ.. నా స్వామి నన్నేలు నోయీ...నీ సాయమే వలదోయీ...
ఈశుని దాసుని చేతువా..


కాని పనీ మదనా.. కాని పని మదనా..
అది నీ చేతకాని పని మదనా...
అహంకరింతువ.. హరుని జయింతువ
అహంకరింతువ.. హరుని జయింతువ
అది నీ చేతకాని పని మదనా ..... కాని పని మదనా...


చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా
చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా
వినకపోతివా ఇంతటితో..
వినకపోతివా ఇంతటితో.. నీ విరిశరముల పని సరి..
సింగిణి పని సరి..  తేజో పని సరి.. చిగురికి నీ పని సరి మదనా
కాని పని మదనా....
చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా... చిలుక తత్తడి రౌత


సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా
ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా


ఇవె కైమోడ్పులు ...  ఇవె సరిజోతలు
వినతులివే అరవిందోజ్వలా... ఇదె వకుళాంజలి మహనీయా
ఇదె హృదయాంజలి... ఈశా మహేశా
సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా
ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా


విరులన్ నిను పూజ సేయగా... విధిగా నిన్నొక గేస్తు జేయగా
దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ...
కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా
మరుడేపున రూపున వర్థిలుగా...
రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ... ప్రభూ... పతిభిక్ష ప్రభూ....


అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో
జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో
అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో...


మనమే నీ మననమై... తనువే నీ ధ్యానమై
నీ భావన లీనమైన గిరిబాలనేలవో


శరణం భవ శరణం భవ శరణం భవ స్వామీ...
పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం స్వామీ..



బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి.. జయమంగళం
జగమేలు తండ్రికి.. జయమంగళం...
విరులచే వరునిచే కరము చేకొనజేయు జగమేలు తల్లికి.. జయమంగళం
కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవా శ్రీ వేణుగోపాల.. మంగళం..
త్రైలోక్య మందార శుభమంగళం...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1705

3 comments:

  1. నాటికి నేటికి సినిమా పాటలలో తేడా నాగలోకానికి నక్కకి ఉన్నంత. రసజ్ఞ గారు- ధన్యోస్మి!!

    ReplyDelete