Saturday, June 27, 2020

కుంతీ విలాపము

చిత్రం :  మంచి రోజు (1970)
సంగీతం :  ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : కరుణశ్రీ
నేపథ్య గానం :  ఘంటసాల


పల్లవి :




అది యొక రమణీయ పుష్పవనము... ఆ వనమందొక మేడ
మేడపై అది యొక మారుమూల గది
ఆ గది తల్పులు తీసి మెల్లగా  పదునైదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల.. జంకొదవెడు కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగాన్.. ఆ.. ఆ
ఆమె సంతోషపడుతున్నదా లేక దుఃఖిస్తున్నదా?
దొరలు ఆనంద బాష్పాలో... పొరలు దుఃఖ బాష్పములో గాని
యవి గుర్తుపట్టలేము


రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెక్కుటద్దాల మీద!
గాలితాకున జలతారు మేలిముసుగు జారె నొక్కింత
అదిగొ.. చిన్నారి మోము పోల్చుకొన్నాములే!
కుంతిభోజపుత్రి స్నిగ్ధసుకుమారి యామె కుంతీకుమారి


ముని మంత్రమ్ము నొసంగ నేల?
ఇడెబో మున్ముందు మార్తాండు రమ్మని  నే కోరగనేల?
కోరితిని బో యాతండు రానేల? 
వచ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగానేల?
పట్టెను బో పట్టి నొసంగనేల?
యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్ 


చరణం 1 :



అయ్యో భగవానుడా! ఈ విషాదాశ్రువుల తోడ నింక నెంత  కాలమీమేను మోతు...గంగాభవాని 
కలుష హారిణి యీ తల్లి కడుపులోన కలిసి పోయెద నా కన్న కడుపుతోడ


ఈ విధంగా నిశ్చయించుకొని బిడ్డను రొమ్ముల్లో అదుము కుంటూ కుంతీకుమారి నదిలోకి దిగిపోతున్నది ….
ఇంతలో నదీ తరంగాల్లో తేలుతూ ఒక పెట్టె అక్కడికి కొట్టుకు వచ్చింది.. కుంతీకుమారి కన్నుల్లో ఆశా కిరణాలు మెరశాయి. ఈశ్వరేఛ్ఛ ఇలా ఉన్నదని గుర్తించింది. ఆమె ఆత్మహత్య నుంచి విరమించుకున్నది. 


అయ్యో తండ్రీ! పున్నమ చందమామ సరిపోయెడి నీ వరహాల మోము  నేనెన్నటికైన చూతునె!
మరే దురదృష్టము గప్పికొన్న నా  కన్నుల కంత భాగ్యమును కల్గునె?
ఏయమ్మయైన యింత నీ కన్నము పెట్టి యాయువిడినప్పటి మాట గదోయి నాయనా! 



తల్లీ.. గంగాభవానీ.. బాలభానుని బోలు నా బాలు నీదు గర్భమున నుంచు చుంటి గంగా భవాని!
వీనినేతల్లి చేతిలోనైన బెట్టి మాట మన్నింపు మమ్మ
నమస్సులమ్మ...  నమస్సులమ్మ... నమస్సులమ్మ



No comments:

Post a Comment