చిత్రం : మయూరి (1985)
సంగీతం : బాలు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : జానకి, బాలు
పల్లవి :
ఎన్నెల్లో ముత్యమా.. ఎండల్లో పద్మమా.. సీకట్లో దీపమా సిరికే ప్రతిరూపమా
ఏ పేరో ఏ వూరో సెప్పవమ్మా ఎలుగింటి కలికంటి తేనెలమ్మా
సెప్పవమ్మా తేనెలమ్మా.. సెప్పవమ్మా తేనెలమ్మా
చరణం 1 :
మహాకవి గురజాడ మానస పుత్రికవు నీవు
పుత్తడిబొమ్మవా? పూర్ణమ్మవా? ఆ...
నా కన్నులు కలువల రేకలనీ
నా అడుగుల హంసల రాకలనీ
నా పలుకులు తేనెల వాకలనీ
తెలిసీ తెలిసీ ఎంత వగచినా తాతతోనే ముడిపెట్టారు తాళితోనే ఉరి తీశారు
అమ్మల్లారా అక్కల్లారా ఆకాశంలో చుక్కల్లారా
నెలకోసారి వస్తూ ఉన్నా నిండుగ పున్నమనై
మీలోనే జీవిస్తున్నా పుత్తడిబొమ్మ పూర్ణమనై... పుత్తడిబొమ్మ పూర్ణమనై
చరణం 2 :
విశ్వనాథుని చేత తొలినాటి కవితవై
విరితేనియలు పొంగు సెలయేటి వనితవై
వెలుగొందు తెలుగు జిలుగుల రాణివి
ఔను కిన్నెరసానివి
తొలుత నా కన్నీరు కాల్వలై పారింది
పిదప అది వాగులై వంకలై పొంగింది
తరగలై నురగలై తరగలే పడగలై
పడగలే అడుగులై అడుగులే మడుగులై
పరుగులెత్తినవాణిని నేను పరువాల దొరసానిని
కొడుకు దశనే దాటి మగడు కాలేని ఒక పడుచువాడికి తగని గడుసు ఇల్లాలిని
నేను కిన్నెరసానిని పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని
నేను కిన్నెరసానిని పెళ్ళైన తెలుగు కన్నెల సాటిని
చరణం 3 :
ఎవ్వరెరుగనిదమ్మ నండూరి ఎంకి
పువ్వులా నవ్వేటి తెలుగు పూబంతి
కడవకైనా లేదు తొడిమంత ఎడము.. ఎడమెట్టాగుంటాది పిడికెడే నడుము
కడవకైనా లేదు తొడిమంత ఎడము.. ఎడమెట్టాగుంటాది పిడికెడే నడుము
మబ్బు తెరనే విడిచే వంకా జాబిల్లి ఉబ్బరాల రైకలో తెప్పరిల్లి
అబ్బలాలో ఏమి నిబ్బరాలో
జారుపైటే చాలు జావళీ పాటు.. లాలాల లలలలలలలలలా...
నాయుడోరి జాణ నడిచేటి వీణ
వెన్నుతడితే చాలు వెన్నెల్లు కరుగు
గోవు పొదుగుల్లోన గోదారి పొంగు
ఎన్నెల్ల మనసిడిచి ఏడు మల్లెలు కురిసి
తెలుగింటా పుట్టింది ఎలుగంటి ఎంకి
ఎలుగల్లే ఎలిగింది సిలకంటి ఎంకి
ఎలుగంటి ఎంకీ సిలకంటి ఎంకి
ఎలుగంటి ఎంకీ సిలకంటి ఎంకి
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12082
No comments:
Post a Comment